
-పైసల్ ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేపిస్తాం..!
-ఓగులాపూర్ ఉపసర్పంచ్ పీఠం పై చిక్కుముడి..!
MAKNEWS ఇల్లంతకుంట స్థానిక సంస్థల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసి ఓ వికలాంగుడు మెజార్టీ ఓట్లతో గెలుపొంది సత్తా చాటాడు. అంతటితో ఆగకుండా తానే ఉపసర్పంచ్ కావాలని వార్డు సభ్యులకు ఆఫర్ల మీద ఆఫర్లు ..కురిపించాడు. దీంతో వార్డు సభ్యులు చేసేదేం లేక అందరూ తనకి మద్దతు పలకడంతో, ఉప సర్పంచ్ గా నియమిస్తూ ఆర్ఓ ఉత్తర్వులను అందజేశారు. అయితే ఇక్కడే ఉప సర్పంచి పీఠంపై చిక్కుముడి ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓగులాపూర్ గ్రామంలో 2 వ వార్డులో సమ్మెట సతీష్ అనే వికలాంగుడు వార్డు సభ్యుడిగా పోటీ చేశాడు. సమీప ప్రత్యర్థి పై గెలుపొంది, ఉప సర్పంచ్ కావాలని పట్టుదలతో ముందుకు వెళ్లాడు. పై సలతో కూడుకున్న వ్యవహారంతో, సతీష్ వెనక్కి వెళ్లకుండా అందరికీ తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చాడు. దీంతో ఆగకుండా చెక్కు బుక్కుపై సంతకం చేసి మరి వారికి నచ్చజె చెప్పాడు. వార్డు సభ్యులందరూ కూడా చేసేదేమి లేక సతీష్ కే జై అన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ తీరా ఆ చెక్కుబుక్కు కాస్త సతీష్ కాకుండా, సతీష్ తల్లి పేరు మీద ఉండడంతో ఒక్కసారిగా వార్డు సభ్యులందరూ కూడా అవాక్కయ్యారు. వెంటనే సతీష్ వద్దకు వెళ్లి మాకు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అక్కడ సతీష్ తల్లి లేకపోవడంతో, ముస్తాబాద్ వెల్లిందని సతీష్ తెలిపాడు. వెంటనే గెలిచిన వార్డు సభ్యులు సతీష్ ను తీసుకుని ఆటోలో ముస్తాబాద్ వెళ్లారు. అక్కడ నుండి తల్లి ఓగులాపూర్ రావడంతో మళ్లి ఓగులాపూర్ వచ్చారు. నీమాట వినం మాకు ఇస్తానన్న రూ.70వేలు ఒక్కోక్కరికి ఇచ్చేయ్ అటూ నిలదీశారు. దీంతో సతీష్ ప్రాంసరీ నోటు పై కూడా అందరికీ డబ్బులు ఇస్తానంటూ రాతపూర్వకంగా రాసిచ్చాడు. రోజులు గడిచినా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో సతీష్ ను మేము ప్రమాణ స్వీకారం చేయనివ్వమంటూ వారు ప్రతిఘించుకుని కూర్చున్నట్లుగా సమాచారం. దీనిపై సతీష్ కూడా సిరిసిల్ల లో పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలిపారు. అయితే 22వ తేదీన ఉపసర్పంచిగా సతీష్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా, మరి మిగతా వార్డు సభ్యులు సతీష్ ను ప్రమాణస్వీకారం చేయనిస్తారా, లేదా అనే సందిగ్దం నెలకొంది. తనకు రక్షణ కావాలంటూ దగ్గరి వాళ్లకు ఫోన్ చేసి చెపుతున్నాడు.ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఇలా డబ్బులు పెట్టి బాహాటంగానే వార్డు సభ్యులను కొనడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నత అధికారులు, ఎలక్షన్ కమీషన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.