దహన సంస్కరణలకు సర్పంచ్, ఉపసర్పంచ్ సాయం

MAKNEWS మరణం ఎవరికైనా బాధాకరమే.. కానీ, ఆ మరణం తర్వాత కడసారి చూసేందుకు బంధుమిత్రులు వచ్చేవరకు మృతదేహాన్ని పెట్టు కోవడానికి కనీసం ఓ గూడు కూడా లేకపోవడం అత్యంత హృదయ విదారకం. పేదరికం సృష్టించిన ఈ దయనీయ స్థితిలో.. చలించిపోయిన స్థానిక యువకులు చూపిన మానవత్వం అందరి హృదయాలను కదిలిస్తోంది.
అనారోగ్యంతో పోరాడి.. అంతిమ ఘడియల్లో గూడు కరువై..
అనారోగ్యంతో రోజుల తరబడి తీవ్రంగా పోరాడిన ఇల్లంతకుంట మండల కేంద్రంలో నివసిస్తున్న కిర్తీ భారతి(65) వివాహిత చివరకు ప్రాణాలు విడిచింది. ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిన తర్వాత, ఆ చలనం లేని దేహాన్ని ఎక్కడ ఉంచాలో తెలియని దీనస్థితి నెలకొంది. బతికి నన్నాళ్లు కష్టాలతో సహవాసం చేసిన ఆమెకు, చనిపోయాక కూడా కనీసం ఒక ఇంట్లో ప్రశాంతంగా పడుకునే అదృష్టం లేకుండా పోయింది. మృతదేహాన్ని భద్రపరచడానికి సొంత ఇల్లు లేకపోవడంతో.. భర్త.. కూతురు ఎప్పుడో మృతి చెందడంతో..ఆ కుటుంబం పడుతున్న ఆవేదన చూసి చుట్టుపక్కల వారు కన్నీటి పర్యంతమయ్యారు.
మానవత్వాన్ని చాటుకున్న యువజన సంఘం సభ్యులు
ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసి స్థానిక యువకులు చలించిపోయారు. ఆ కష్టాన్ని తమ సొంత కష్టంగా భావించి వెంటనే రంగంలోకి దిగారు.
ఆశ్రయంగా మారిన భవనం
ఆ మహిళ మృతదేహాన్ని వీధిలో ఉంచడం ఇష్టం లేని యువకులు, గౌరవప్రదంగా ఉంచేందుకు తమ ‘యువజన సంఘం’ భవనాన్ని తెరిచారు.
మృతదేహం పాడవకుండా ఉండేందుకు రాత్రికి రాత్రే ఒక ఫ్రీజర్ ను తీసుకువచ్చి, ఆ రాత్రంతా ఆమె దేహాన్ని భవనంలో సురక్షితంగా భద్రపరిచారు. యువకులు కూడా రాత్రంతా అక్కడే ఉండి ఏర్పాట్లను చూసుకున్నారు.
రాత్రంతా మృతదేహాన్ని భద్రపరిచిన యువకులు.. ఉదయం బంధువులు, స్థానికులు కడసారి చూపు చూసుకునేలా ఏర్పాట్లు చేశారు. మృతురాలి చెల్లెలు, చెల్లెలు కొడుకు దేవరాజు సహాయంతో తెల్లవారుజామున అంత్యక్రియలు పూర్తి చేసి తమ బాధ్యతను నెరవేర్చారు.
ఆర్థిక సాయం అందించిన సర్పంచ్ ఉప సర్పంచ్..
అనారోగ్యంతో మృతి చెందిన కీర్తి భారతి ధన సంస్కరణ నిమిత్తం, స్థానిక సర్పంచ్ మామిడి రాజు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు, ఆయనతో పాటుగా ఉపసర్పంచ్ మూగు నాగరాజు శర్మ 5116 ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.