
మహిళా బిల్లుపై బీజేపీ డ్రామాలు చేస్తుంది
-మహిళలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది
maknews/ఇల్లంతకుంట
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఊరుకోమని, ఉత్తరాది రాష్ర్టాలపై బీజేపి ప్రేమచూపిస్తుందని, కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వంపై మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం హైదరాబాద్ ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లు ద్వయం రాజ్యాంగ విలువలను పక్కనపెట్టి నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని పేర్కొంటూ, ఇది కేంద్ర ప్రభుత్వ అహంకారానికి తగిన సమాధానమని అభివర్ణించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. 2023లో ఆమోదం పొందిన బిల్లును 2024 ఎన్నికల్లో అమలు చేయకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు.
రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన తో ముడిపెట్టడం మహిళల హక్కులను వాయిదా వేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా బిల్లును విడిగా తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. జనాభా నియంత్రణలో ముందంజలో ఉన్న రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కోమటి రెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఉట్కూరు వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, తీగల పుష్పలత గౌడ్, మామిడి రాజు, కాతమల్లేశం, అరకాల నవీన్ కుమార్, నేరెళ్ల విజయ్, తదితరులు పాల్గొన్నారు.